హైదరాబాద్:  తెలంగాణ ఆర్టీసీ రూ. 600 కోట్లను  ఉద్యోగుల జీత భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం మళ్లించింది. కాలం చెల్లించిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు కోసం తెచ్చిన రూ. 600 కోట్లను జీతాల కోసం ఉపయోగించారు. 

టీఎస్ ఆర్టీసీ క్రెడిట్  కో ఆపరేటివ్ బకాయిలు చెల్లించేందుకు కూడ ఈ రుణాన్ని ఉపయోగించాలని భావించారు. సీసీఎస్ బకాయిలతో పాటు చెల్లించాల్సిన పీఎఫ్  బకాయిల కోసం ఈ నిధులు ఉపయోగించాల్సి ఉంది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే మాసాల్లో  ఆర్టీసీకి ఎలాంటి ఆదాయం రాలేదు. దీంతో లోన్ నుండే ఉద్యోగులకు జీత భత్యాల చెల్లింపుకు ఉపయోగించాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చి 22 నుండి మే 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడపలేదు. మే 19వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను తిరిగి ప్రారంభించారు.

also read:తెలంగాణ ఆర్టీసీలో కరోనా కలకలం: 200 మందికి కోవిడ్

రాష్ట్రంలో 10 వేల బస్సులుంటే 30 నుండి 50 శాతం బస్సులను మాత్రమే ఆర్టీసీ నడుపుతోంది.  కరోనాకు ముందు రాష్ట్రంలో ఆర్టీసీకి ప్రతి రోజూ రూ. 12 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ లాక్ డౌన్ తర్వాత కనీసం రూ.  2 కోట్లు కూడ రావడం లేదు.

జీహెచ్ఎంసీ పరిధిలో బస్సులు ఇంకా నడపడం లేదు. దీంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి లోన్ అమౌంట్ ను వాడుకొంటుంది.ప్రతి నెల ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ. 140 కోట్లు అవసరం. అద్దె బస్సుల యాజమానులకు కూడ లోన్ నుండే డబ్బులు చెల్లించారు.ఆర్ధిక సహాయం చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.