ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బతుకు దేరువు కోసం.. సొంత ఊరు కాదని..బతుకుదేరువు కోసం.. దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఒకే చోట కలిసి జీవించారు. కానీ.. ఒక్క చిన్న విషయంలో మొదలైన అనుమానం.. ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీయడానికి కారణం అయ్యింది. మూడేళ్ల  క్రితం జరిగిన ఈ సంఘటనను పోలీసులు తాజాగా చేధించారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే... మెదక్‌కు చెందిన జయప్రకాశ్‌(27), విజయ్‌కుమార్‌(30) సమీపబంధువులు, స్నేహితులు. 2015లో ఢిల్లీకి వలసవెళ్లి దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్‌లో విక్రమ్‌సింగ్‌ అనే వ్యక్తికి చెందిన అపార్ట్‌మెంట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అనేక ప్రయత్నాల తర్వాత ఇద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగాలు పొందారు. విజయ్‌ తన ప్రేయసికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జయప్రకాశ్‌కు చెప్తుండేవాడు. అనేకసార్లు జయప్రకాశ్‌ ఆమెతో ఫోన్‌ ద్వారా, నేరుగా మాట్లాడాడు. దీంతో జయప్రకాశ్‌పై విజయ్‌ అనుమానం పెంచుకున్నాడు. తన ప్రేయసితో సన్నిహితంగా ఉంటూ దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భావించి జయప్రకాశ్‌ను అంతం చేయడానికి పథకం వేశాడు.  

జయప్రకాశ్ ని హత్య చేసి.. పూలకుండీలో శవాన్ని దాచి పెట్టాడు. అనంతరం పోలీసులకు తన ఫ్రెండ్ కనపడటం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. తర్వాత హైదరాబాద్ కి వచ్చేశాడు. ఈ ఇద్దరూ ఉండి వచ్చిన ఇంట్లోకి వేరే వాళ్లు తాజాగా అద్దెకు దిగారు. అక్కడ గది శుభ్రం చేస్తుండగా పూల కుండీలో.. అస్థిపంజరం కనిపించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు నిజం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.