ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లిధరలు చుక్కలంటుతున్న సంగతి తెలిసిందే. బహిరంగ మార్కెట్లలో కేజీ ఉల్లి రూ.120 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఆయా ప్రభుత్వాలు రైతు బజార్లు, చౌక డిపోలు ఇతర మార్గాల ద్వారా ఉల్లిని సబ్సిడీ ద్వారా అందించే ప్రయత్నాలు చేస్తున్నా డిమాండ్‌కు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఉల్లిధరలు కొద్దికొద్దిగా కిందకి దిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:తప్పని తిప్పలు... క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే

కొద్దిరోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లి ధర రూ.12,000 రూపాయలు పలకగా.. ప్రస్తుతం రూ.4 వేలకు తగ్గినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు ఉల్లి సరఫరా భారీగా పెరిగింది.

రెండు వారాల క్రితం రోజుకు 50 నుంచి లారీలు భాగ్యనగరానికి వచ్చేవి.. అయితే ప్రస్తుతం 80 నుంచి 100 లారీల ఎర్రగడ్డలు హైదరాబాద్ వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కేవలం మహారాష్ట్ర నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా ఉల్లి సరఫరా పెరగడంతో ధరలు తగ్గాయి.

Also Read:ఆయన దశ మార్చిన ‘ఉల్లి’.... ఒక్క దెబ్బతో కోటీశ్వరుడయ్యాడు..

రాష్ట్రంలో ఉల్లిధరలను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉల్లిని కొనుగోలు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఈజిప్ట్ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంది.

ఈ విధంగా సేకరించిన ఉల్లిని రాష్ట్రంలోని రైతు బజార్లు, హోల్‌సేల్ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ ద్వారా అందించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల మొదటి వారంలో కొత్త పంట మార్కెట్‌ను ముంచెత్తనుండటంతో ఉల్లి ధరలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.