జనగామ: బిర్యానీ కోసం వెళ్లి వరద నీటిలో చిక్కుకొన్న నలుగురిని  అతి కష్టం మీద స్థానికులు కాపాడారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా వెళ్లి వరదలో చిక్కుకొన్నారు. 

జిల్లాలోని వడ్లకొండ శివారులోని సుందయ్యనగర్ కు చెందిన నలుగురు స్నేహితులు బిర్యానీ తినాలని అనుకొన్నారు. మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో జనగామకు బయలుదేరారు. జనగామ- హుస్నాబాద్ రహదారిపై వడ్లకొండ గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

also read:భారీ వర్షాలు: నేడు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

ఈ కల్వర్టుపై నుండి వెళ్లొద్దని వెనక్కు వెళ్లాలని పోలీసులు వారికి సూచించారు. అయితే పోలీసుల సూచనలను పట్టించుకోకుండా ఆ నలుగురు కారులో ముందుకు వెళ్లారు.

వరద ఉధృతికి వాగులో కారు అరకిలోమీటరు దూరం కొట్టుకుపోయింది.వాగు మధ్యలో తాటటి చెట్టు కారును అడ్డుకొంది. కారులో చిక్కుకొన్న నలుగురిలో ఒకరు తన ఫోన్ ద్వారా తమ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.

గ్రామస్తులు, పోలీసులు వాగు వద్దకు చేరుకొన్నారు. రాత్రి పదిన్నర గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకు కూడ సహాయక చర్యలు చేపట్టారు. గానుగపహాడ్ కు చెందిన యువకులు తాళ్ల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు.

పోలీసుల హెచ్చరికలు ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లిన రెడ్డబోయిన నరేష్, రెడ్డబోయిన కనకరాజు, మరిగడికి చెందిన పుట్ట రవి, పట్నాల వెంకటేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.