కరీంనగర్: అచ్చు సినిమాలో చూపినట్టుగా జగిత్యాల జిల్లాలో ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సంఘటన జరిగిన తీరును చూస్తే నలుగురు ప్రమాదం నుండి  బయటపడడం వారి అదృష్టంగా చెప్పుకొంటున్నారు.

జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి వ్యవసాయబావి అంచు వద్ద ఆగిపోయింది. ఈ కారులో ప్రయాణీస్తున్న నలుగురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారికి స్వల్పగాయాలయ్యాయి.

గోదావరిఖని నుండి కరీంనగర్ కు నలుగురు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కారు ముందు టైరు ఒకటి బావిలోకి వెళ్లింది. కారు వెనుక టైరుకు ఓ రాయి అడ్డుపడింది. ఈ రాయి కారణంగానే  కారు బావిలో పడకుండా నిలిచిపోయింది.

ఈ బావిలో సుమారు  10 అడుగుల మేర నీరుంది. బావిలో కారు బోల్తా కొడితే ఈ నలుగురు ప్రాణాలతో బయటపడేవారు కాదు.  డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో  కారు బావి ముందుభాగంలో నిలిపోయింది.

కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ బావికి రక్షణగా ఓ గోడ  ఏర్పాటు చేయాలని కోరినా కూడ చర్యలు తీసుకోలేదన్నారు.