గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. నిన్నటితో ఎవరి బలం ఏంటో.. అందరికీ  తెలిసిపోయింది. ఊహించని విధంగా బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి అందరికీ షాకిచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు హ్యాట్రిక్ సాధించారు. వారిలో ఇద్దరు ఎంఐఎం అభ్యర్థులు కాగా. మిగిలిన ముగ్గురు టీఆర్ఎస్ నేతలు కావడం గమనార్హం.

ఎంఐఎం తరపున మాజిద్ హుస్సేన్ 2009 ఎన్నికల్లో అహ్మద్ నగర్ నుంచి గెలుపొంది మేయర్ అయ్యారు. 2016, 2020లో మెహదీపట్నం నుంచి గెలిచారు. అక్బర్ బాగ్ డివిజన్ నుంచి సయ్యద్ మినాజుద్దీన్ 2009, 2016, 2020లో వరసగా విజయం సాదించారు. మచ్చబొల్లారం డివిజన్ నుంచి జితేంద్రనాథ్ 2010లో టీడీపీ తరపున, 2016, 2020లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.

గాజుల రామారాం అభ్యర్థి రావుల శేషగిరి 2009లో కాంగ్రెస్ 2016, 2020లో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచిన ముద్దం నర్సింహయాదవ్ కూడా హ్యాట్రిక్ సాధించారు.

రియాసత్ నగర్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి ముస్తఫా బేగ్ వరసగా నాలుగోసారి గెలుపొందడం విశేషం. రామ్నాస్ పురా డివిజన్ ఎంఐఎం అభ్యర్థి ముబీన్ సైతం 2002లో ఆగాపురా నుంచి 2009, 2016 లో రామ్నాస్ పురా, ఈసారి శాస్ట్రిపురం నుంచి గెలుపొందారు. గోషామహల్ నియోజకవర్గంలోని బేగం బజార్ డివిజన్ బీజేపీ అభ్యర్థి గొంటి శంకర్ యాదవ్ వరసగా నాలుగోసారి విజయం సాధించారు. 2002, 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా.. 2016లో బీజేపీ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. ఈసారి మరోసారి వియం సాధించారు.