వనపర్తి: తెలంగాణలోని వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో సంభవించిన సామూహిక మరణాల విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన విషయం తెలిసిందే. నలుగురికి కూడా విషప్రయోగం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. 

వారిపై ఎవరు విషప్రయోగం చేశారు, ఎందుకు చేశారనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. వారే విషం తీసుకునే మరణించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మరణించిన నాలుగు మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. 

మృతులను ఆజీరాం (63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్నాయి. వారి మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వంటగదిలో అజీరాం బీ, డైనింగ్ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనక గుంత వద్ద ఖాజా పాషా, హసీన మృతదేహాలు పడి ఉన్నాయి. ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉంటాయని తొలుత అనుమానించారు.