తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పట్లో విరమించేలా కనపడటం లేదు. ఆర్టీసీ జేఏసీ కార్మికులు కాస్త వెనక్కి తగ్గి... విధుల్లోకి తిరిగి చేరతామనిచెప్పినా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో.. కేంద్రం రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆర్టీసీ సమ్మెపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆర్టీసీని, కార్మికులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు నితిన్ గడ్కరీని కలిశారు. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో నితిన్ గడ్కరీ మాట్లాడతానని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు అధికారులతో మాట్లాడతానని బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 40నిమిషాలు బీజేపీ ఎంపీలు.. నితిన్ గడ్కరీతో సమావేశం కావడం గమనార్హం. 

AlsoRead ఆర్టీసీ కార్మికులపై తేల్చని కేసీఆర్: తుది తీర్పు తర్వాతే నిర్ణయం..

ఆర్టీసీ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై తెలంగాణ సీఎంతో మాట్లాడతానని నితిన్ గడ్కరీ చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తామన్నారని ఆయన చెప్పారు.