హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వాయిదా వేశారు. రేపు హైకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. దీంతో ఆర్టీసీ కార్మికులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ గురువారం సాయంత్రం రవాణా శాఖాధికారులతో సమీక్షించారు. 

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం విస్తృత చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 

వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్య అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది.
 ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో చర్చ జరిగింది. 

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఎజి ప్రసాద్,అడిషనల్ ఎజి రాంచందర్ రావు, ఆర్టీసీ ఇడిలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్ సమీక్ష తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.


ఆర్టీసీకి ఇప్పటికే 5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు 2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే 240 కోట్ల రూపాయలు కావాలి. సిసిఎస్ కు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు 65-70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 

మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్ల రూపాయలు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. 

యధాతథంగా నడపడం అసాధ్యం

ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది.ఈ పరిస్థితులతో పాటు రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏ విధమైన షరతులు లేకుండా విధుల్లో చేర్చుకుంటే తాము సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జెఎసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురువారం సాయంత్రం రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఆర్టీసీ కార్మికులు 45 రోజుల పాటు సమ్మె చేశారు. చివరకు కోర్టు ఏమీ తేల్చకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకునే విషయంపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వాల విచక్షణకు వదిలేస్తున్నట్లు తెలిపింది. అయితే, కార్మికులు తప్పు చేస్తే ఔదార్యంతో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. 

రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మె పరిష్కారం అయ్యేలా చూడాలని హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బేషరతుగా ప్రభుత్వం కార్మికులను విధుల్లో చేర్చుకుంటే సమ్మెను విరమిస్తామని అశ్వత్థామ రెడ్డి చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

సమ్మె విరమణకు అశ్వత్థామరెడ్డి ఆఫర్: సాయంత్రం కేసీఆర్ సమీక్ష