Asianet News TeluguAsianet News Telugu

జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ మోడీకి షాక్.. టీఆర్ఎస్ లోకి నలుగురు బీజేపీ కార్పోరేటర్లు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఈ పార్టీకి చెందిన నలుగురు కార్పోరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కేటీఆర్ మండిపడ్డారు. 

four bjp corporators join in trs in hyderabad
Author
Hyderabad, First Published Jun 30, 2022, 9:44 PM IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు (bjp national executive meeting) ప్రధాని మోడీ (narendra modi) , అమిత్ షా (amit shah) , జేపీ నడ్డా వంటి అతిరత మహారథులు హైదరాబాద్ కు వస్తున్న వేళ.. తెలంగాణలో ఆ పార్టీకి షాకిచ్చింది టీఆర్ఎస్. జీహెచ్ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పోరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గురువారం కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పోరేటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో వీరంతా టీఆర్ఎస్ గూటికి చేరడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

హస్తినాపురం కార్పొరేటర్ బానోతు  సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరగా కేటీఆర్ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

Also Read:జూలై 2న యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు రాక: మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

మరోవైపు.. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్- బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీపై మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన జాబ్ సెక్యూరిటీ అడిగితే సెక్యూరిటీ గార్డ్ లుగా మారుస్తారా అంటూ ఫైరయ్యారు. మోడీ చెప్పిన నల్లధనం ఎక్కడికి పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. బైబై మోడీ అని చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు బీజేపీ సర్కస్ నడవబోతోందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. 

ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన... మోడీ పరిపాలనను పోల్చి చూడాలని ఆయన సూచించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని.. తాము చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పమంటే ఎంతైనా చెబుతామని, కేంద్రం చేసిన పని ఒక్కటైనా వుందా అని కేటీఆర్ నిలదీశారు. టూరిస్టులు వస్తారు.. పోతారని, వాళ్లు అబద్ధాలు మాత్రమే చెబుతారంటూ దుయ్యబట్టారు. అప్పట్లో గ్యాస్ ధర పెంపుకు సంబంధించి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను దద్దమ్మ అన్నారని.. మరి ఇప్పుడు రూ.1,050కి చేరిందని కేటీఆర్ విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వెనక్కి తీసుకువచ్చే పనులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios