హైదరాబాద్: కేసీఆర్ కుటుంబం అక్రమాస్తుల్ని సంపాదించిందని మాజీ ఎంపీ,  కాంగ్రెస్  పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ ఆరోపించారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో కల్వకుంట్ట కుటుంబం ఆస్తులు 424 శాతం పెరిగాయని  ఆయన చెప్పారు.రేపు కవిత ఆస్తుల చిట్టాను విప్పుతానని ఆయన ప్రకటించారు.

శనివారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కవిత ఆస్తుల చిట్టాను బయటపెడతానని యాష్కీ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై న్యాయ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై చర్చకు తాను సిద్దమని ఆయన ప్రకటించారు. కేసీఆర్ బతుకేంటో తెలంగాణలో అందరికీ తెలుసునన్నారు.

కేసీఆర్ కుటుంబానికి సోనియాను విమర్శించే అర్హత లేదని చెప్పారు.త్యాగాలకు మారుపేరైన సోనియా గాంధీని విమర్శించడం  కేసీఆర్ దురంహకారానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.సత్యం రామలింగరాజు కొడుకు తేజ్‌రాజ్ తో మలేషియా ప్రధానితో మంత్రి కేటీఆర్ కన్పించారని ఆ ఫోటోను మీడియా  సమావేశంలో మధు యాష్కీ ప్రదర్శించారు.

ఇక్కడ కేసీఆర్ కుటుంబం సంపాదించిన నల్లధనాన్ని  విదేశాలకు పంపే పనిని తేజ్‌రాజ్ చూస్తున్నారని మధు యాష్కీ ఆరోపణలు చేశారు.తేజ్‌రాజ్ భార్య కాల్ హెల్త్ సంస్థ నడుపుతోందన్నారు. కాల్ హెల్త్ కార్యాలయం నుండి చీకటి వ్యాపారాలు  సాగుతున్నాయని  చెప్పారు.

ఎలాంటి టెండర్లు లేకుండానే  రూ. 1500 కోట్ల మిషన్ భగీరథ పనులను చేపట్టారని  మధు యాష్కీ తెలిపారు.బెంగుళూరులో  కేటీఆర్ రియల్ ఏస్టేట్  బినామీల గుట్టును ఆధారాలతో సహా త్వరలోనే  బయటపెడతానని యాష్కీ ప్రకటించారు.బెంగుళూరులో కవిత కొన్న విల్లాల ఫోటోలు కూడ బయటపెడతానని మధు యాష్కీ చెప్పారు.