హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్లు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారని చెప్పారు. ఉద్యోగులు, వృద్దులు తమ అభిప్రాయాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలిపిందన్నారు.

 

రెండు విషయాలు ఇక్కడ స్పష్టమయ్యాయన్నారు. సాధారణ ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని తేలిందన్నారు. అదే సమయంలో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు ఎదిరించే సత్తా బీజేపీకే ఉందని భావించారని... కాంగ్రెస్ కాదని ఈ ఫలితాలు తెలుపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో  బీజేపీ కీలక నేతలు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారని... ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. తనకు అన్ని పార్టీల్లో స్నేహితులు ఉన్నారని ఆయన చెప్పారు. తాను బీజేపీలో చేరడం లేదని ఆయన ఆ సమయంలో స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ట్విట్టర్ వేదికగా కొండా  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి.