న్యూఢిల్లీ: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.ఇప్పటికే వరుసగా ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్, బీజేపీల్లోకి క్యూ కట్టారు. తాజాగా పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఖమ్మం ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధిగా పోటీ చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రయత్నించారు. కానీ ఈ స్థానం నుండి రేణుకా చౌదరికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది.

రెండు దఫాలుగా ఎమ్మెల్సీగా సుధాకర్ రెడ్డి పనిచేశారు. యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సుధాకర్ రెడ్డి పనిచేశారు.ఇటీవలనే ఎమ్మెల్సీగా పొంగుటే పదవీకాలం పూర్తైంది. మరోసారి తనకు ఎమ్మెల్సీ పదవిని  ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. కానీ, పార్టీ నాయకత్వం ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు.

అంతేకాదు గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి సుధాకర్ రెడ్డి పోటీ చేయాలని భావించినప్పటికీ మిత్రులకు పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను కేటాయించడంతో ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. దీంతో పొంగులేటి సుధాకర్ రెడ్డి  అసంతృప్తితో ఉన్నారు. 

ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ బీజేపీలో చేరనున్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డిని బీజేపీలో చేర్పించడంలో రామ్ మాధవ్ క్రియాశీలకంగా వ్యవహరించారని సమాచారం.

సంబంధిత వార్తలు

అవమానాలు ఎదుర్కొన్నా: కాంగ్రెస్‌పై పొంగులేటి