అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో తాను అవమానాలు ఎదుర్కొంటున్నానని చెప్పారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో తాను అవమానాలు ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాజ్యసభ్య సభ్యులు బండి పార్ధసారథి, వద్దిరాజు రవిచంద్రల కృతజ్ఞత సభకు సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్.. నాయకులందరినీ కలుపుకుని వెళ్లాలని జిల్లా నేతలకు చెప్పారని అన్నారు. అయితే కేటీఆర్ ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోతే పార్టీని వీడటం ఖాయం అని చెప్పారు.
అదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తాటి వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే స్థాయి తుమ్మల నాగేశ్వరరావుకు లేదన్నారు. కేసీఆర్ పాలనలో గిరిజన ప్రతినిధులకు అవమానాలే ఎదురయ్యాయని అన్నారు. రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ తనకు జూనియర్ అవుతారని.. తాను 1981లోనే సర్పంచ్ ఎన్నికల్లో గెలిచానని చెప్పారు.
ఇక, గతంలో కూడా పార్టీ కమిటీల విషయంలో తాటి వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి తుమ్మలను లక్ష్యంగా చేసుకుని అప్పుడు తాటి వెంకటేశ్వర్లు నేరుగా కేటీఆర్‌కు లేఖ రాశారు. దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాలకు సంబంధించి నూతన కమిటీలలో సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వెనుకబడిన తరగతులకు ఏ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కమిటీలో ఉన్న పేర్లు పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచాయని చెప్పారు. ఈ నేతలతో భవిష్యత్తులో టీఆర్‌ఎస్ సమస్యలు ఎదుర్కొంటుందని లేఖలో పేర్కొన్నారు. అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే నాగేశ్వరరావును పట్టించుకోకుండా మాజీ మంత్రి తుమ్మల బుల్లోజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
