హైదరాబాద్: గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే,  టీఆర్ఎస్ నేత నర్సారెడ్డిని టీఆర్ఎస్‌ నుండి సస్పెన్షన్  చేశారు.   పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది.  నర్సారెడ్డి శనివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 

కొంత కాలంగా నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉన్న  నర్సారెడ్డిని వారం రోజుల క్రితం మంత్రి హారీష్ రావు  బుజ్జగించారు.  కానీ, గురువారం రాత్రి విజయశాంతితో  నర్సారెడ్డి భేటీ అయ్యారు.శుక్రవారం నాడు ఉదయం రోడ్డు డెవలప్‌మెంట్ కార్పోరేషన్ పదవికి నర్సారెడ్డి రాజీనామా చేశారు.

 

 

                                                                     

 

 

నెల రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడ నర్సారెడ్డి భేటీ అయ్యారని  ప్రచారం సాగింది. టీఆర్ఎస్ ప్రచారంలో కూడ నర్సారెడ్డి యాక్టివ్ గా లేరని ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఈ విషయమై మంత్రి హరీష్ రావు  నర్సారెడ్డితో చర్చించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రచారంలో నర్సారెడ్డి పాల్గొన్నారు.

కానీ, గురువారం సాయంత్రం విజయశాంతితో భేటీ కావడం... మీడియాలో  విస్తృతంగా ప్రచారమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్  నుండి నర్సారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ శుక్రవారం ఉదయం ప్రకటించింది.

నర్సారెడ్డి ఇప్పటికే ఢీల్లీలో ఉన్నారు. అక్టోబర్ 27వ తేదీన నర్సారెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. 2014 ఎన్నికల సమయంలో గజ్వేల్ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్థిగా  కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నర్సారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. 

నర్సారెడ్డి చివరి రెండు రోజుల్లో సరిగా ప్రచారం నిర్వహించలేదని....పరోక్షంగా కేసీఆర్ గెలుపుకు సహకరించారని అప్పట్లో ప్రచారంలో ఉంది.  నర్సారెడ్డి తన ఓట్లు వేయించుకోంటే  ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కష్టంగా ఉండేదని  రాజకీయ పరీశీలకులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నర్సారెడ్డి కాంగ్రెస్ ను వీడీ టీఆర్ఎస్ లో చేరారు.  ఆయనకు రోడ్డు డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా  బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. 

ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డిపైనే  కేసీఆర్ విజయం సాధించారు. ఈ దఫా నర్సారెడ్డి కూడ తిరిగి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడం టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.