హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైపల్యం చెందిందని ప్రజలు భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు కూడ ఆయన రాజీనామాలు సమర్పించారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. 

also read:కాంగ్రెస్‌కు మరో షాక్: కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా, బీజేపీలో చేరికకు రంగం సిద్దం

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉంటున్నట్టుగా ఆయన చెప్పారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటివ్వకున్నా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాలన పోరాటం చేశానని ఆయన తెలిపారు. 

గత ఆరేళ్లుగా పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కూడ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారని ఇందుకు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలే ఉదహరణగా ఆయన పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా కూడ ఇంకా కొత్త నాయకుడిని ఇంకా ఎన్నుకోలేకపోయారన్నారు.ప్రజా సమస్యలపై పోరాటం బీజేపీతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.