హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్  ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలో అన్ని పదవులకు ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన పంపారు. 

బీజేపీలో చేరాలని కూన శ్రీశైలం గౌడ్ నిర్ణయం తీసుకొన్నారు. ఇవాళ ఆయన  బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా ఆయన విజయం సాధించారు. ఆ సమయంలో  కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూన శ్రీశైలం గౌడ్ యాక్టివ్ గానే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.