హైదరాబాద్: చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే  కేఎస్ రత్నం  టీఆర్ఎస్ కు షాకివ్వనున్నారు. చేవేళ్ల టిక్కెట్టు దక్కకపోవడంతో టీఆర్ఎస్‌ను వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరాలని రత్నం నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు  సోమవారం నాడు  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేఎస్ రత్నం సమావేశమయ్యారు.

2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి  కేఎస్ రత్నం  టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో రత్నం టీడీపీ అభ్యర్థిగా చేవేళ్ల నుండి పోటీ చేసి విజయం సాధించారు.  అయితే తెలంగాణాలో ఆనాడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  టీడీపీకి  కేఎస్ రత్నం, పట్నం మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పారు.

ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో చేవేళ్ల నుండి  రత్నం టీఆర్ఎస్ అభ్యర్థిగా, పట్నం మహేందర్ రెడ్డి  తాండూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. మహేందర్ రెడ్డి విజయం సాధించి ప్రస్తుతం రద్దైన మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.

చేవేళ్ల నుండి పోటీ చేసిన  రత్నం కాంగ్రెస్ అభ్యర్థి కాలే యాదయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో యాదయ్యను టీఆర్ఎస్‌లో చేర్పించడంలో  మంత్రి మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.  అయితే యాదయ్యను టీఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని రత్నం తీవ్రంగా వ్యతిరేకించారు.

తాజాగా కేసీఆర్ ప్రకటించిన జాబితాలో చేవేళ్ల నుండి టిక్కెట్టు దక్కుతోందని భావించిన రత్నానికి నిరాశే ఎదురైంది. దీంతో రత్నం  తన అనుచరులతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకొన్నారు.

సోమవారం నాడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే రత్నం తన అనుచరులతో కలిసి  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ఇదిలా ఉంటే 2009కు ముందు  ఈ స్థానం జనరల్  కేటగిరిలో ఉండేది. ఈ నియోజకవర్గం నుండి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో  సబితా ఇంద్రారెడ్డి సూచించిన వ్యక్తులకు చేవేళ్ల టిక్కెట్టు దక్కే అవకాశం లేకపోలేదు.

అయితే  2009లో రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరినా... సబితా  ఇంద్రారెడ్డి ఆశీస్సులు ఉంటేనే టిక్కెట్టు దక్కే అవకాశం లేకపోలేదని  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రత్నానికి సబితా రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని.. టిక్కెట్టు విషయంలో ఇబ్బంది ఉండకపోచ్చని కూడ రత్నం వర్గీయులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త చదవండి

టీఆర్ఎస్‌కు మరో షాక్: కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి రత్నాకర్ రావు