ఖమ్మం: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డాడు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు వద్ద ఖమ్మం నుండి కొత్తగూడెం వైపు వస్తున్న కారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహానాన్ని ఢీకొట్టింది. దీంతో రాంరెడ్డి దామోదర్ రెడ్డి వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకొన్న స్థానికులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మరో వాహనంలో దామోదర్ రెడ్డిని ఆయన స్వగ్రామం లింగాలకు పంపారు. 

మాజీ మంత్రి కారును ఢీకొట్టిన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దామోదర్ రెడ్డి స్వల్పగాయాలతో బయటపడడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన మద్దతుదారులు ఊపిరి పీల్చుకొన్నారు.

ఖమ్మం జిల్లాలోని లింగాల దామోదర్ రెడ్డిది స్వంత గ్రామం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల నుండి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.