నాకే సీటిస్తానని హామీ: హుజూరాబాద్ బైపోల్స్‌పై పెద్దిరెడ్డి సంచలనం
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తనకు టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చిందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హుజూరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తనకు టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చిందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఓ తెలుగున్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. హుజూరాబాద్ ఎన్నికలు భిన్నమైనవని ఆయన చెప్పారు.
also read:అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తా: ఈటలకు పెద్దిరెడ్డి షాక్
ప్రజల ఆకాంక్షల మేరకు తాను నడుచుకొంటానని ఆయన ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న తనకు సమాచారం లేకుండానే కార్యక్రమాలు సాగుతున్న విషయమై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాలకు తాను హాజరౌతున్నట్టుగా ఆయన తెలిపారు.బీజేపీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను తాను పాటిస్తానని ఆయన చెప్పారు. తనకు పార్టీతో భిన్నాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 14వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరే విషయంలో పెద్దిరెడ్డి అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. తనకు సమాచారం లేకుండా కనీసం చర్చించలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. అయితే బండి సంజయ్ పెద్దిరెడ్డితో చర్చించిన తర్వాత మెత్తబడినట్టుగా ప్రచారం సాగింది.
ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి ఈటల రాజేందర్ సన్నాహలు చేసుకొంటున్నారు. ఈ తరుణంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.