హైదరాబాద్: దివంగత హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి భార్య అహల్య సోమవారం నాడు మృతి చెందారు. 

ఈ నెల 21వ తేదీన  రాత్రి నాయిని నర్సింహ్మారెడ్డి కన్నుమూశారు.  అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.నాయిని మరణించిన సమయంలో ఆయన భార్య అహల్య కూడ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆమె వీల్ చైర్ లోనే జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానానికి చేరుకొన్నారు. మహా ప్రస్తానం నుండి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.  నాయిని నర్సింహ్మారెడ్డితో పాటు ఆయన భార్య కొడుకు, అల్లుడికి కూడ కరోనా సోకింది .అయితే కరోనా నుండి నాయిని నర్సింహ్మారెడ్డితో పాటు ఆయన ఇతర కుటుంబ సభ్యులు కోలుకొన్నారు. ఆసుపత్రిలోనే నాయిని నర్సింహ్మారెడ్డి భార్య చికిత్స తీసుకొంటున్నారు.

భర్త చనిపోయిన రోజుల వ్యవధిలోనే అహల్య మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాయిని నర్సింహ్మారెడ్డి తొలి హోం మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాయిని నర్సింహా రెడ్డికి కేబినెట్  లో చోటు దక్కలేదు.