Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మోత్కుపల్లి భేటీ: వచ్చే నెలలో కాంగ్రెస్‌లోకి

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారంనాడు బెంగుళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.

Former minister Motkupalli Narasimhulu meets Karnataka Deputy CM DK Shiva kumar lns
Author
First Published Sep 29, 2023, 3:55 PM IST | Last Updated Sep 29, 2023, 4:51 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారంనాడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో  మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు.  అక్టోబర్ మొదటి వారంలో మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది.2009 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుండి మోత్కుపల్లి నర్సింహులు  టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 

 

2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో  మోత్కుపల్లి నర్సింహులు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ ను మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. అయితే గత నెలలో  కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మోత్కుపల్లి నర్సింహులుకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.  

1983లో టీడీపీ ఆవిర్భావ సమయంలో  ఆ పార్టీ ద్వారా మోత్కుపల్లి నర్సింహులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  ఆలేరు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా  మోత్కుపల్లి నర్సింహులు  విజయం సాధించారు.ఇటీవలనే  చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నర్సింహులు  ఒక్క రోజు దీక్ష చేశారు.  టీడీపీలో ఉన్న సమయంలో తనకు  రాజ్యసభ ఇవ్వనందుకు చంద్రబాబుపై  మోత్కుపల్లి నర్సింహులు దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో మోత్కుపల్లి నర్సింహులుకు , రేవంత్ రెడ్డికి పొసగలేదు. రేవంత్ రెడ్డి తీరును మోత్కుపల్లి నర్సింహులు బహిరంగంగానే విమర్శించారు. అయితే ప్రస్తుతం  టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే  తనకు రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని  ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో  మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు సోదరుడని వ్యాఖ్యానించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి మోత్కుపల్లి నర్సింహులు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  హైద్రాబాద్ వచ్చిన తర్వాత  ఏ రోజున తాను  కాంగ్రెస్ లో చేరేది ఇతర విషయాలపై మాట్లాడుతానని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. కాంగ్రెస్ నుండి తనకు ఆహ్వానం ఉందని ఆయన తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios