కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు సహా పలువురు: కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు
న్యూఢిల్లీ: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లి కృష్ణారావుతో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
గురువారంనాడు ఉదయం న్యూఢిల్లీలో ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ లో నిర్వహించే ప్రియాంక గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని వీరంతా భావించారు. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొల్లాపూర్ లో సభను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లి కృష్ణారావుతో పాటు ఇతర నేతలకు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
2014 అసెంబ్లీ ఎన్నికలకు కొంత కాలం ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు జూపల్లి కృష్ణారావు. 2014లో కొల్లాపూర్ అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.
కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య సఖ్యత కోసం బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు చేసింది. కానీ ఇరువర్గాలు పట్టు వీడలేదు. హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు సవాళ్లు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన బీఆర్ఎస్ నాయకత్వం జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటేసింది. అయితే జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్, బీజేపీలు గాలం వేశాయి. అయితే కాంగ్రెస్ లో చేరడానికి జూపల్లి కృష్ణారావు మొగ్గు చూపారు. గత మాసంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కొల్లాపూర్ లో సభ వాయిదా పడడంతో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ లో చేరేందుకు రెండు రోజుల క్రితమే జూపల్లి కృష్ణారావు న్యూఢిల్లీకి చేరారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాల బిజీషెడ్యూల్ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇవాళకు వాయిదా పడింది.
also read:కొల్లాపూర్‌లో ప్రియాంక సభకు ఆటంకాలు.. ఢిల్లీకి బయల్దేరిన జూపల్లి, రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గుర్నాథరెడ్డిపై రేవంత్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ నాయకత్వం తీరుపై గుర్నాథరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కూడ జూపల్లి కృష్ణారావుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.