Asianet News TeluguAsianet News Telugu

నీ భరతం పడతా: మిస్టర్ హరీష్ రావు అంటూ ఈటల ఫైర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్  సోమవారం నాడు హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నీచమైన పనులు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చిల్లర కావొద్దని హరీష్ కి ఆయన సూచించారు.

former minister Etela Rajender serious comments on Harish rao
Author
Hyderabad, First Published Sep 13, 2021, 9:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 హుజూరాబాద్: మిస్టర్ హరీశ్ రావు  నీతో పాటు 18 ఏళ్లు పనిచేశాను. నీవు ఉద్యమకారుడివే.. నేను కూడా ఉద్యమ కారుడినేనని  మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హుజూరాబాద్ లోనికృష్టమైన, నీచమైన పనులు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో చిల్లరకావొద్దని ఈటల రాజేందర్ హరీష్ రావుకి హితవు పలికారు.హుజురాబాద్  సింగపూర్ గెస్ట్ హౌస్ లో కూర్చుని హరీశ్ రావు కుట్రలు చేస్తున్నాడని ఈటల రాజేందర్ ఆరోపించారు.

హుజురాబాద్ మధువని గార్డెన్ లో  బీజేపీ మీటింగ్, చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, హుజురాబాద్ మండల బిజెపి అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, హుజురాబాద్  టౌన్ ఎన్నికల ఇంచార్జీ హరీష్ రెడ్డి, మైలేదేవపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి,  అశ్వత్థామ రెడ్డి పాల్గొన్నారు. 

నీ భరతం పడుతమని ఇప్పటికే చెప్పానన్నారు. నీ బ్రోకర్ మాటలు ఎవరూ నమ్మరని హరీష్ రావుకు చెప్పారు. నన్ను మంత్రి పదవి తీసేసినప్పుడు నాపై దళితుల భూముల ఆక్రమించుకున్నాడని చెప్పారు. ఇప్పుడేమో.. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టాడని ఇక్కడ మహిళలతో చెబుతున్నాడన్నారు. నేను ఏనాడైనా ముఖ్యమంత్రి కావాలనుకున్నానా.. ? కేవలం మనిషిగా గుర్తించమని అడిగింది మనిద్దరమే కదా? అని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 తనపై చేసిన ఆరోపణలు నిజమేనని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలవా? అని ఆయన హరీష్ రావుని ప్రశ్నించారు. ఇంత నీచమైన నికృష్టమైన స్థాయికి ఎందుకు దిగజారిపోయావు మిత్రమా? అని ఈటల ప్రశ్నించారు.ఇది నీకు తగునా మిత్రమా? తెలంగాణ సమాజం ఒకనాడు నీవు మాట్లాడితే ఉప్పొంగింది. కానీ ఇప్పుడు నీవు హుజురాబాద్ లో చెబుతున్న మాటలు విని అసహ్యించుకుని థూ అని ఉమ్మెస్తున్నారని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.

మీ మామ చెప్పిన భూ కుంభకోణం నిజమా.. లేదా నీవు చెప్పినట్లుగా సీఎం కుర్చీకి ఎసరు పెట్టిందా నిజమా తేల్చాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.దళిత ఎమ్మెల్యేల్లారా, మిగతా ఎమ్మెల్యేల్లారా.. నేనేంటో మీకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు. ప్రగతి భవన్ లో మీ అందరికీ ఎంట్రీ ఉందా?  అని ఆయన ప్రశ్నించారు.

also read:Huzurabad Bypoll:ఈటల ఇలాకాలో హరీష్ హల్ చల్... భారీ ఎత్తున సంబరాలు (వీడియో)

మీలాంటోళ్లకు ధైర్యం లేకపోతే.. నాలాంటోడు చెప్పకపోతే పార్టీ నాశనమవుతుందని మాట్లాడానని ఈటల రాజేందర్ చెప్పారు.నామీద చిల్లర రాతలు రాసిన నాడు.. ఎవడ్రా నీవు.. రాసినోడా అని అడిగాను. ఈ జెండాకు ఓనర్నని చెప్పానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

మధ్యలో వచ్చి, మధ్యలో పోయానంటున్నాడు... నేను మధ్యలో వచ్చానా..? 2001లో పార్టీ పెడితే.. 2002లో పార్టీలోకి వచ్చాను. నీ కంటికి నేను కనబడలేదు కావచ్చన్నారు.నీవు వెళ్లగొట్టేదాకా.. గడ్డిపోచదాకా ఊదేదాకా మీ వెంటనే ఉన్నాను కదా...  నాకు నేనుగా రాజీనామా చేయలేదు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అవమానపరిచే విధంగా మాట్లాడితే రాజీనామా చేశానని ఈటల రాజేందర్ తెలిపారుసర్వేలకు అందకుండా, ఎవరి ఊహకు అందకుండా టీఆర్ఎస్ హుజురాబాద్ లో డిపాజిట్ కోల్పోబోతోంది. ప్రజలు చాలా తెలివైన వాళ్లు.. ఎవరు వెళ్తే వాళ్లకే ఓటేస్తామని చెబుతారన్నారు ఈటల రాజేందర్.

కరీంనగర్ సీపీ స్వయంగా సీఐలకు పోలీసులకు ఫోన్ చేసి వాళ్లను, వీళ్లను పట్టుకురమ్మని ఆదేశిస్తున్నాడట. నీవు తొత్తువు కావచ్చు కమిషనర్…. మా కానిస్టేబుల్స్, ఎస్సైలు, సీఐలు మాత్రం తొత్తులు కాదు. వాళ్లకు నా గురించి తెలుసు. గతిలేక, గత్యంతరం లేక నీ ఆర్డర్లు పాటించవచ్చన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.

ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి పోయిన తర్వాత నీ జేజమ్మ వల్ల కూడా కాదు. అన్నింటికంటే గొప్పది ప్రజాశక్తి.. ప్రజలే చరిత్ర నిర్మాతలు. .. హుజురాబాద్ చరిత్ర రాసేది ఇక్కడి ప్రజలే. వాళ్లను ఆపగలిగే, కొనగలిగే శక్తి నీకు కాదు కదా.. నీ జేజెమ్మకు కూడా లేదని రాజేందర్ చెప్పారు.

84 శాతం ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారని ఇండియా టుడే సర్వే చెప్పిన తర్వాత కూడా మీరు మారకుంటే మీకు శాస్తి తప్పదు. మీ పాలనకు చరమగీతం పాడబోతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.డబ్బులు, మద్యం పంచకుండా, ప్రజాస్వామికంగా ఎన్నికల్లో తలబడితే  టీఆర్ఎస్‌కి డిపాజిట్ దక్కదని ఆయన చెప్పారు. 

హరీష్ రావు బండ్లు పంపి, బిర్యానీ పెట్టీ, డబ్బులు ఇచ్చినా ప్రజలు మీటింగ్ కి సరిగా రావడం లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో 150 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా అంటున్నారు. ఎన్నికలు అయిపోగానే మార్చి పోయారు.2018 ఎన్నికల మేనిఫెస్టో కూడా మరచిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

ఇప్పుడు దళిత బంధు ఇస్తా అంటే ఎవరన్నా నమ్ముతారా? హుజూరాబాద్ లో దళిత అకౌంట్ లో డబ్బులు వేసి తీసుకోవడానికి వీలు లేకుండా హోల్డ్ లో పెట్టారన్నారు. రోజుకో బిల్డింగ్ కి శంకుస్థాపన చేస్తున్నారు. వాటికి డబ్బులు ఎక్కడ నుండి తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios