హైదరాబాద్: ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు పోలీస్ కస్టడీ గురువారం నాడు ముగిసింది. అఖిలప్రియకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధించారు. 

మూడు రోజుల పాటు అఖిలప్రియను విచారించిన హైద్రాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. బేగంపేటలోని పీహెచ్‌సీలో భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం అఖిలప్రియను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. 

also read:మూడు రోజుల కస్టడీలో 300 ప్రశ్నలు: అఖిలప్రియ నుండి కీలక సమాచారం సేకరణ

పరీక్షల తర్వాత ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. 14 రోజుల జ్యూడీషీయల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మూడు రోజుల విచారణలో సుమారు 300కి పైగా ప్రశ్నలను పోలీసులు అఖిలప్రియకు వేశారు. ఆమె నుండి కీలక సమాచారాన్ని సేకరించారు. భూ వివాదం పరిష్కారం కోసం ప్రయత్నించినా ప్రవీణ్ రావు సోదరుల నుండి స్పందన రాకపోవడంతో కిడ్నాప్ చేసినట్టుగా అఖిలప్రియ పోలీసుల విచారణలో చెప్పారని సమాచారం.

భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులను అదుపులోకి తీసుకొంటే మరింత కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

హఫీజ్‌పేటలోని 33 ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్ రావుతో పాటు భూమా నాగిరెడ్డి కుటుంబం మధ్య వివాదం సాగుతోందని పోలీసులు గుర్తించారు.