హైదరాబాద్:గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాం కేసులో సీబీఐ మాజీ జడ్జి నాగమారుతీ శర్మ ఏసీబీ కోర్టులో సోమవారం నాడు సాక్ష్యం ఇచ్చారు. తనకు గాలి జనార్ధన్ రెడ్డి మనుషులు బెయిల్ కోసం లంచం ఇవ్వజూపారని నాగమారుతి శర్మ ఏసీబీ కోర్టులో ఇవాళ సాక్ష్యం చెప్పారు.

ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయ్యాడు. 2012 జూన్ 4వ తేదీన హైద్రాబాద్ కు చెందిన నాచారం యాదగిరి రావును అనే రౌడీ షీటర్ ను గాలి జనార్ధన్ రెడ్డి మనుషులు కలిశారు. నాచారం యాదగిరి రావు గాలి జనార్దన్ రెడ్డి కి బెయిల్ కోసం ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా సీబీఐ గుర్తించి అరెస్ట్ చేసింది.

గాలి జనార్ధన్ రెడ్డి మనుషులు బెయిల్ కోసం తీవ్రంగా నే ప్రయత్నించారు.ఈ క్రమంలోనే అప్పటి సీబీఐ జడ్జి పట్టాబి రామారావు 2012 జూన్ 10వ తేదీన గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. అయితే గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ రావడంతో సీబీఐ విచారణ జరిపింది. ఈ విచారణలో బెయిల్ స్కాం వెలుగు చూసింది. నాచారం యాదగిరి రావుతో పాటు పలువురిని  ఆ సమయంలో సీబీఐ అరెస్ట్ చేసింది.

ఈ క్రమంలోనే ఆ సమయంలో  సీబీఐ జడ్జిగా ఉన్న నాగమారుతి శర్మను  గాలి జనార్ధన్ రెడ్డి మనుషులు కలిశారు.  బెయిల్ కోసం నాగమారుతి శర్మతో సంప్రదింపులు జరిపారు. ఈ విషయమై ఏసీబీ కోర్టులో సోమవారం నాడు నాగమారుతీ శర్మ సాక్ష్యం చెప్పారు.

బెయిల్ ఇస్తే తనకు రూ. 40 కోట్లు ఆఫర్ చేశారని నాగమారుతీ శర్మ ఇవాళ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ ఆఫర్ ను తాను తిరస్కరించినట్టుగా ఆయన వివరించారు. ప్రాణాన్నైనా వదులుకొంటాను కానీ, ధర్మాన్ని తప్పనని తాను  తనకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తులకు స్పష్టం చేసినట్టుగా ఆయన తెలిపారు.ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వచ్చే నెల 12వ తేదీకి విచారణను వాయిదా వేశారు.