మాజీ సీఎం కేసీఆర్ 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సింది - కేటీఆర్
మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీలు పెట్టడానికి బదులు, 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఉంటే బాగుండేదని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే ఆయనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు అవకాశం ఉండేదని చెప్పారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీ స్థాపించే కంటే 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఉండే బాగుండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఆయనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టేందుకు అవకాశం ఉండేదని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక దుర్వినియోగం, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ పోస్టులో ‘‘ఎన్నికల అనంతర ఫలితాల్లో నాకు వస్తున్న ఆసక్తికరమైన ఫీడ్ బ్యాక్, పరిశీలనలు వస్తున్నాయి. అందులో ఇప్పటి వరకు అత్యుత్తమమైనది. ‘32 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి బదులుగా కేసీఆర్ గారు 32 యూట్యూబ్ ఛానళ్లను ఏర్పాటు చేసి నకిలీ ప్రచారాన్ని తిప్పికొట్టి ఉంటే బాగుండేది’ ఇదే ’’ అని పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిందంటూ, భారీ అప్పుల ఊబిలోకి నెట్టి వేసిందంటూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో సాధించిన విజయాలను, సృష్టించిన సంపదను తెలియజేస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను కుంగిన అంశంపై కూడా ఇరువర్గాల మధ్య చర్చ కొనసాగుతోంది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడం, అన్నారం బ్యారేజీకి జరిగిన నష్టంపై అధికార పార్టీ న్యాయ విచారణకు ఆదేశించింది. రెండు రోజుల కిందట మంత్రుల బృందం బ్యారేజీలను సందర్శించింది. మేడిగడ్డ వద్ద మునిగిపోయిన పిల్లర్ల ఫొటోలను విడుదల చేశారు. అలాగే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కాన్వాయ్ కోసం 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొని, విజయవాడలో దాచిందని, సీఎం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే వాటిని తీసుకురావాలనుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
అయితే దీనిపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రోటోకాల్ ను సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖలు నిర్ణయిస్తాయని అన్నారు. ఏ ప్రజాప్రతినిధి కూడా ఇన్ని వాహనాలు కావాలని అడగరని అన్నారు. కాన్వాయ్ ను ఎక్కడ తయారు చేయాలనేది కూడా భద్రతా సిబ్బందే నిర్ణయించి రహస్యంగా ఉంచుతారని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యంగంగా మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు.