ఫామ్ హౌస్ కు అవి కావాలని ఫోన్ చేసిన మాజీ సీఎం కేసీఆర్.. షాప్ యజమాని షాక్..
Former CM KCR called the fertilizer shop owner : మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లాలో ఉన్న ఓ ఎరువుల షాప్ యజమానికి ఆయన కాల్ చేశారు. ఎరువులు, విత్తనాలు ఫాం హౌస్ కు పంపించాలని కోరారు.
KCR : గత అసెంబ్లీ ఎన్నికల వరకు బిజీ బిజీగా గడిపిన మాజీ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు కొంత కాళీ సమయం దొరికినట్టు తెలుస్తోంది. ఎర్రవల్లిలోనిఫామ్ హౌస్ లో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో దానికి చికిత్స తీసుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత తన వ్యవసాయ క్షేత్రంలో మళ్లీ వ్యవసాయం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఆనుకొని ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసేందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర వస్తువులు కావాలని సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వంటిమామిడి గ్రామంలో ఉన్న ఓ ఫర్టిలైజర్ షాప్ యజమానికి మాజీ సీఎం కేసీఆర్ కాల్ చేశారు. అయితే మొదట ఆ షాప్ యజమాని కేసీఆర్ వాయిస్ విని ఎవరో ఆట పట్టిస్తున్నారని అనుకున్నారు. కానీ కొంత సమయం తరువాత షాప్ యజమాని తనకు ఫోన్ చేసింది మాజీ సీఎంయే అని నమ్మి షాక్ కు గురయ్యారు.
తరువాత తేరుకొని ‘‘ఏం కావాలో చెప్పండి సార్’’ అని అడిగారు. పది రోజుల్లో ఫామ్ హౌస్ కు రాబోతున్నానని కేసీఆర్ చెప్పారు. అక్కడ వ్యవసాయం చూసుకుంటానని అన్నారు. వ్యవసాయం చేసేందుకు అవసమైన ఎరువులు, విత్తనాలు పంపించాలని కోరారు. దీనికి ఆ షాప్ యజమాని స్పందిస్తూ.. తప్పకుండా రెండు, మూడు రోజుల్లో అన్నీ పంపిస్తానని చెప్పారు. అనంతరం మాజీ సీఎం ఆరోగ్యం గురించి ఆ షాప్ యజమాని అడిగి తెలుసుకున్నారు.
తాను బాగానే ఉన్నానని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని చెప్పారు. కాగా.. మాజీ సీఎం కేసీఆర్, ఫర్టిలైజర్ షాప్ యజమానికి ఫోన్ చేయడం, ఆయన మాట్లాడటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాట్సప్ గ్రూప్స్ లోనూ ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. మాజీ సీఎం త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆ వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు.