కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు, లోకేష్
telangana former cm kcr healthపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన గాయం విషయం తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నారా లోకేష్ కూడా కేసీఆర్ కోవాలని ఆకాంక్షించారు.
kcr health : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బాత్రూంలో కాలుజారి కింద పడ్డారు. దీంతో ఆయనకు గాయాలు కావడంతో గురువారం రాత్రి యశోద హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘‘కేసీఆర్ గారికి గాయమైందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’ అని చంద్రబాబు నాయుడు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు పెట్టారు. అలాగే ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. ‘‘కేసీఆర్ గారు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
కాగా.. మాజీ సీఎం కేసీఆర్ ను పరీక్షించిన తర్వాత తాజాగా యశోద హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. బాత్రూంలో జారిపడడంతో కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి కేసీఆర్ కు ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఎడమ తుంటికి సాయంత్రం వరకు సర్జరీ నిర్వహించే అవకాశం ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు. ఆయనను హాస్పిటల్ కు పంపించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం ఆదేశించినట్టు రిజ్వి హాస్పిటల్ అధికారులతో చెప్పారు.