నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులపై దాడి చేయలేదంటున్నారు ఫారెస్ట్ అధికారులు. మర్మంగాలపై బూట్లతో దాడి చేశామన్నది తప్పన్నారు. వైద్యుల నివేదిక, ఎఫ్ఐఆర్‌లో మర్మాంగాలపై దాడి చేశామన్న విషయం లేదని చెప్పారు

నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులపై దాడి చేయలేదంటున్నారు ఫారెస్ట్ అధికారులు. మర్మంగాలపై బూట్లతో దాడి చేశామన్నది తప్పన్నారు. వైద్యుల నివేదిక, ఎఫ్ఐఆర్‌లో మర్మాంగాలపై దాడి చేశామన్న విషయం లేదని చెప్పారు.

గాయపడ్డ గిరిజనులకు, తమ సిబ్బందికి వైద్య ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు. ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకుండా రాత్రి పూట అడవిలో బస చేయడం నేరమని, జంతువుల దాడి జరిగితే బాధ్యత ఎవరు వహించాలని ప్రశ్నించారు.

అడవిలో ఇప్ప పువ్వులు, నన్నారి గడ్డ, చిల్లగింజలు, ముష్టి గింజలు లాంటి అటవీ ఉత్పత్తుల సేకరణలో ఫారెస్ట్ అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అటవీ ప్రాంతంలో చెంచులను ఎప్పుడూ అడ్డుకోలేదని.. గిరిజనులు ఇప్పపూల సేకరణపై అటవీశాఖ ఎలాంటి ఆంక్షలు విధించలేదని తేల్చి చెప్పారు.

మరోవైపు తమపై దాడి చేసిన ఫారెస్ట్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్ఆర్సీ ఛైర్మన్‌ను కలిశారు నల్లమల బాధితులు. ఈ నెల 26న అర్థరాత్రి అన్యాయంగా ఫారెస్ట్ సిబ్బంది గిరిజనులపై దాడి చేశారని ఆరోపించారు.

హోలీ పండుగ కోసం ఇప్పపూలు ఎరడానికి వెళ్లిన గిరిజనులపై ఫారెస్ట్ సిబ్బంది పాశవికంగా దాడి చేశారని మండిపడ్డారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసే అధికారం అధికారులకు ఎవరిచ్చారని మండిపడుతున్నారు బాధితులు.

తాము ఎవరికి అన్యాయం చేయలేదని, ఎవరికీ హానీ చేయలేదని చెప్పారు. ఇప్పపూలు కోసుకునే స్వేచ్ఛ కూడా గిరిజనులకు లేదంటూ వాపోయారు. తమపై దాడి చేసిన ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.