ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకరు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రియురాలి ఇంట్లోనే అతను శవమై కనిపించడం గమనార్హం. కాగా... అక్రమ సంబంధం నేపథ్యంలోనే అతను చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  బానోవత్‌ నెహ్రూ(37)తో 2013 సంవత్సరంలో వివాహమైంది. వీరు బట్టిసావర్గాం సమీపంలోని పోలీసు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి సాయి శరణ్య, శ్రీహర్ష ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తలమడుగు మండలంలోని బరంపూర్‌లో ఎఫ్‌బీవోగా నెహ్రూ విధులు నిర్వహిస్తున్నాడు. గతేడాది ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ మహిళతో అక్రమ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై మహిళ పోలీసు స్టేషన్‌లో పలుసార్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబీకులు మందలించినప్పటికీ ఆయన తీరు మారలేదు. 

కాగా గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో పాత హౌజింగ్‌ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్న సదరు మహిళ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై ఆ మహిళ పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో సమాచారాన్ని అందజేసింది. తాను ఇంట్లో లేని సమయంలో నెహ్రూ ఉరివేసుకొని ఉన్నాడని, తలుపు తీసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడంతో కొడవలితో తాడును కోశానని, అప్పటికే ఆయన మృతిచెందినట్లు పోలీసులకు వివరించింది.

కాగా... తమ కుమారుడిని సదరు మహిళ చంపేసిందంటూ అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  తాము చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్లలేదని, తమకు తెలియకుండానే అక్కడినుంచి శవాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారని అన్నారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆందోళన చేపట్టారు.తలకు, మెడ చుట్టూ గాయాలు ఉన్నాయని కన్నీరు పెట్టారు. తన కుమారుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.