సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు బంధించారు. దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జూకి తరలించారు.
సంగారెడ్డి జిల్లాలో చిరుత రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, అనంతరం బోనులోకి ఎక్కించి జూకి తరలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. కాగా.. జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్స్‌లో చిరుత సంచరిస్తోంది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుత హెటిరో పరిశ్రమలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హెటిరో పరిశ్రమలోని హెల్ బ్లాక్‌లో చిరుత దాక్కుంది. దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని చిరుతను బంధించే ఏర్పాట్లు చేశారు. జిల్లా అటవీ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని నెలల క్రితం కూడా చిరుత హెటిరో పరిశ్రమలో సంచరించింది. ఆ సమయంలో కూడా చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయింది.
