బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజిన్ కారణంగా 100 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో వారు బాధపడుతున్నారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో (basara IIIT) ఫుడ్ పాయిజన్ కావడం కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో వంద మందికి పైగా విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) స్పందించారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ పై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. 

ఇకపోతే.. బాసర ట్రిపుల్​ ఐటీలో వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్​ వీసీని నియమించాలనే డిమాండ్లతో స్టూడెంట్స్​ కొన్నిరోజుల పాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆహారం, ఇతర ప్రాథమిక సౌకర్యాల నాణ్యతను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. ఎండ, వానను లెక్కచేయకుండా క్యాంపస్​లో కూర్చొని నిరసన చేపట్టారు. విద్యార్ధులతో జిల్లా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్​రెడ్డి , కలెక్టర్​ ముషారఫ్​ ఆలీ ఫారూఖి, ఎస్పీ ప్రవీణ్​ కుమార్​పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం లేదా విద్యాశాఖ మంత్రి నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. 

ALso REad:బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో చర్చలు సఫలం.. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీతో ఆందోళన విరమణ..

అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలకు.. 20 మంది సభ్యులతో కూడిన స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్‌ హాజరైంది. ఈ సందర్భంగా నెలరోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మళ్లీ క్యాంపస్​కు వస్తానని చెప్పారు. ఇక, చర్చల అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. తమ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.