నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనను విరమించారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు.

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనను విరమించారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా విద్యార్థులు క్యాంపస్‌లోనే ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత అర్ధరాత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌‌తో చర్చలు సఫలం కావడంతో.. విద్యార్థులు ఆందోళనను విరమించారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు.

సోమవారం ఉదయం హైదరాబాద్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి బాసర చేరుకున్నారు. ఆమె వెంట నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, బాసర ట్రిపుట్ ఐటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ రాహుల్‌ బొజ్జా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెంకట్‌ రామన్న, బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌ సతీష్‌ కుమార్‌, విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, పోలీసు సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఉన్నారు. రాత్రి 9.30 గంటల తర్వాత రెండున్నర గంటలకు పైగా విద్యార్థులతో చర్చలు జరిపారు. 

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలకు.. 20 మంది సభ్యులతో కూడిన స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్‌ హాజరైంది. ఈ సందర్భంగా నెలరోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మళ్లీ క్యాంపస్​కు వస్తానని చెప్పారు. ఇక, చర్చల అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. తమ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం నుంచి తరగతులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. ఇక, బాసర ట్రిపుల్ ఐటీకి రూ. 5.6 కోట్లు వెంటనే విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

బాసర ట్రిపుల్​ ఐటీలో వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్​ వీసీని నియమించాలనే డిమాండ్లతో వారం రోజులుగా స్టూడెంట్స్​ ఆందోళన చేస్తున్నారు. ఆహారం, ఇతర ప్రాథమిక సౌకర్యాల నాణ్యతను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. ఎండ, వానను లెక్కచేయకుండా క్యాంపస్​లో కూర్చొని నిరసన చేపట్టారు. మరోవైపు స్టూడెంట్స్​తో జిల్లా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్​రెడ్డి , కలెక్టర్​ ముషారఫ్​ ఆలీ ఫారూఖి, ఎస్పీ ప్రవీణ్​ కుమార్​పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం లేదా విద్యాశాఖ మంత్రి నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. 

సోమవారం ఏడో రోజూ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ప్రధాన గేటు వద్ద నిరసనను కొనసాగించారు. వర్షం కురుస్తున్నప్పటికీ గొడుగులు పట్టుకుని మరి నిరసన కొనసాగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.. హైదరాబాద్ నుంచి బాసర చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు సఫలం కావడంతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనలు విరమించారు.