Asianet News TeluguAsianet News Telugu

నీటమునిగిన సిరిసిల్ల... సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం: కలెక్టర్, ఎస్పీతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణం జలమయం అవడంతో సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్,ఎస్పీతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ తెలిపారు.

floods in siricilla... minister ktr teleconference with collector and sp
Author
Sircilla, First Published Sep 7, 2021, 2:30 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో వర్షం, వరద పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 

మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పట్టణ మున్సిపల్ కమిషనర్ తో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణంలోని పలు కాలనీలు జలమయమయినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో వెంటనే వరద ప్రభావిత కాలనీల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

READ MORE  సిరిసిల్లలో కుండపోత... చెరువులా మారిన రోడ్లు, ఇళ్లమధ్యలో వరదనీటి ఉదృతి (వీడియో)

సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి సిరిసిల్ల పట్టణంలోని కాలనీల్లో ఇప్పటికే వరద ఉదృతి పెరిగింది. రానున్న 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వుండాలని కేటీఆర్ ఆదేశించారు. వరద ప్రభావిత కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి వారికి ఆశ్రయం కల్పించాలని సూచించారు. 

జనావాసాల్లోకి చేరుకున్న వరదనీటిని మల్లించడానికి అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని అంచనా వేయాలని... వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల కోసం హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అధికారులకు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios