సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం.. బెగ్గింగ్ మాఫియా పనేనా..?
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఐదేళ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఐదేళ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే బెగ్గింగ్ మాఫియా బాలుడిని అపహరించిందా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్ తన ఐదేళ్ల కొడుకుతో కలిసి తిరుమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుని.. అలసిపోవడంతో స్టేషన్‌లోనే పడుకున్నాడు.
తర్వాత నిజామాబాద్ వెళ్లేందుకు ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌పై వచ్చారు. తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ వద్ద ఉంచి దుర్గేశ్ వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అయితే తిరిగి వచ్చేసరికి బాలుడు కనిపించలేదు. దీంతో వెంటనే స్టేషన్‌లోని జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బాలుడిని తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. అయితే బాలుడి మానసిక స్థితి సరిగా లేదని దుర్గేశ్ చెప్పాడు.
అయితే రైల్వే స్టేషన్‌లో దుర్గేశ్, అతడి కొడుకు కదలికలను గమనించినవారే.. ఈ కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బాలుడి కిడ్నాప్ వెనక బెగ్గింగ్ మాఫియా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక, బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.