పండుగ వేళ తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.

వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్థరాత్రి మట్టి మిద్దె కూలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామంలో చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మరణించాడు. ఆయన భార్య మణెమ్మ (68) గ్రామంలో నివసిస్తోంది. ఆమె కుమారులు హైదరాబాదులో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో గ్రామానికి వచ్చారు. 

శనివారం ఆ కార్యక్రమం ముగిసింది. రాత్రి భోజనాల తర్వాత 9 మంది ఓ గదిలో పడుకున్నారు. ఆ గది పైకప్పు కూలడంతో అందులో పడుకున్న మణెమ్మతో పాటు ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ (40), ఉమాదేవి (35), మనవరాళ్లు వైష్ణవి (14), అక్షయ (12) అక్కడికక్కడే మరణించారు. మూడో కుమారుడ కుమారస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. 

కుమారస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించారు ఆయన భార్య సుప్రజ, ఆమె కూతుళ్లు వైష్ణవి, అక్షయ ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు 100కి సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను వనపర్తి ఆస్పత్రికి తరలించారు.