Asianet News TeluguAsianet News Telugu

యజమాని ఇంటికి కన్నమేసిన డ్రైవర్, తోటమాలి: కోటీ 29 లక్షల చోరీ

పనిలోంచి తీసేశాడనే కోపంతో డ్రైవర్, తోటమాలి యజమాని ఇంటికి కన్నమేశారు. హైదరాబాదులోని అసదుద్దీన్ నివాసంలో గత నెలలో వారిద్దరు మిత్రులతో కలిసి కోటీ 29 లక్షలు ఎత్తుకెళ్లారు.

Five arrested in theft case in Hyderabad
Author
Hyderabad, First Published Aug 11, 2020, 8:16 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: హైదరాబాదులోని గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలోని బాల్ రెడ్డినగర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పనిలోంచి తీసేశాడనే ఆగ్రహంతో డ్రైవర్, తోటమాలి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి యజమాని ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. రూ.1.29 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారు. పది రోజుల తర్వాత వారు పోలీసులకు చిక్కారు. 

ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియా సమావేశంలో సోమవారం వెల్లడించారు. బాల్ రెడ్డినగర్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి అసదుద్దీన్ అహ్మద్ నివాసంలో ఆ చోరీ జరిగింది. టోలీచౌకీలో ఉంటున్న మహ్మద్ అప్సర్, మిరాజ్ అష్వాక్ అసదుద్దీన్ వద్ద డ్రైవర్ గానూ ఫౌం హౌస్ లో తోటమాలిగానూ పనిచేసేవారు. 

రెండేళ్ల క్రితం అసదుద్దీన్ ఇద్దరినీ పనిలోంచి తీసేశాడు. దాంతో వారు ఆయనపై కక్ష పెంచుకున్నారు. పక్కా ప్రణాళిక వేసి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మిలిటరీ క్వార్టర్స్ లో నివసిస్తున్న మిత్రులు రెహమాన్ బేగ్, మహ్మద్ అమీర్, సయ్యద్ ఇమ్రాన్ ల సాయంతో చోరీకి పాల్పడ్డారు. 

బక్రీద్ పండుగకు పది రోజుల ముందు అసదుద్దీన్ షామీర్ పేటలోని ఫాంహౌస్ కు వెళ్తాడని, ఆ సమయంలో దొంగతనం చేయడం సులభంగా ఉంటుందని భావించారు. గత నెల 22వ తేదీ అర్థరాత్రి అఫ్సర్, మిరాజ్ తలుపు పగులగొట్టి బీరువాలోని రూ.1.29 కోట్లను సంచల్లో తీసుకుని వెళ్లి రెహ్మాన్ ఇంట్లో దాచారు. కొంత డబ్బు తీసుకుని బైక్ కొన్నారు. గత నెల 23వ తేదీన అసదుద్దీన్ ఫాంహౌస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. 

చోరీ జరిగిన విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీకెమెరాలు, మొబైల్స్ ఆధారంగా మహ్మద్ అఫ్సర్, మిరాజ్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను పోలీసులు సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios