తెలంగాణలో వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది ఆరోగ్య శాఖ. తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ సెకండ్ డోస్ మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 15 వరకు కోవిడ్ తొలి డోసును నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వారు రాష్ట్రంలో 11 లక్షల మంది వున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. మరోవైపు 18 నుంచి 45 ఏళ్లలోపు వయసువారికి వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు తెలంగాణ అధికారులు. సీఎం ఆమోదం తర్వాత దీనిని అమలు చేయనున్నారు.

Also Read:తెలంగాణలో కరోనా జోరు: 24 గంటల్లో 5892 కేసులు

తెలంగాణకు కరోనా వ్యాక్సిన్  డోసులు తక్కువగా వస్తుండటంతో ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలనే ఆలోచనలో వుంది ప్రభుత్వం. ముందుగా జర్నలిస్ట్‌లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు వంటి జనసంచారం వుండే ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.