హైదరాబాద్ మాదాపూర్ లో కాల్పుల కలకలం, ఒకరి మృతి
హైదరాబాద్ లోని మాదాపూర్ లో సోమవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లోని మాదాపూర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మాదాపూర్ లో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ముజీబ్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరొకరికి గాయాలయ్యాయి. స్థిరాస్తి గొడవల వల్లే కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
నిరూస్ సిగ్నల్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇస్మాయిల్ మీద పాయింట్ బ్లాంక్ రేంజులో కాల్పులు జరిపారు. మరో వ్యక్తి జహంగీర్ మీద కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ మరణంచాడు. గాయపడిన జహంగీర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇస్మాయిల్, జహంగీర్, మహ్మద్ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య రియల్ ఎస్టేట్ వివాదం కొనసాగుతోంది.
వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇస్మాయిల్, జహంగీర్ లను మహ్మద్ నిరూస్ వద్దకు పిలిచాడు. వారి మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో మహ్మద్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇస్మాయిల్ పక్కన ఉన్నవారిని భయపెట్టి చెదరగొట్టడానికి మరో ఆయుధంతో జిలానీ అనే వ్యక్తి కూడా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఇస్మాయిల్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. జహంగీర్ చికిత్స పొందుతున్నాడు.
ఇదిలా ఉండగా, జూలై 17న ఇలాంటి ఘటనే హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జూలై 16 రాత్రి తుక్కుగూడ సమీపంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గుర్తు తెలియని దుండగులు ఓ లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మనోజ్ యాదవ్ అనే వ్యక్తి జార్ఖండ్‌కు చెందినవాడు. అతను ఐరన్ లోడ్ లారీతో ప్రయాణిస్తున్నాడు. లారీ కేరళలోని కొచ్చికి వెడుతోంది.
మతోన్మాదాన్ని ఎవరు వ్యాప్తి చేస్తున్నారు?: అజిత్ దోవల్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ
ఈ క్రమంలో లారీ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడ ఎగ్జిట్ 14 దగ్గరికి రాగానే.. అక్కడికి కారులో వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి.. హఠాత్తుగా తన దగ్గరున్న తుపాకీతో లారీ డ్రైవర్ వైపు కాల్పులు జరిపాడు. అనుకోని ఈ ఘటనకు ఓఆర్ఆర్ వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. అతను కారులో నుంచి కాల్పులు జరపడం వల్ల లారీ డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ లారీ ముందు క్యాబిన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కాల్పులను గమనించిన అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేశాడు. దీంతో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పహాడీ షరీఫ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటన మీద పూర్తిస్తాయి అంచనా కోసం.. ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. కాల్పులు జరిపిన తరువాత సదరు దుండగుడు కారులో శంషాబాద్ వైపు పారిపోయి ఉండొచ్చని, పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. దోపిడి ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిగాయా? గతంలో కాల్పులు జరిపిన వ్యక్తికి, బాధితుడికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ‘‘జూలై 16 శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనిమీద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాం. కాల్పులు జరిగిన లారీని గుర్తించాం. లారీ డ్రైవర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నాం. నిందితుడిని గుర్తించాల్సి ఉంది’’ అని పోలీసులు తెలిపారు.