సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్ని ప్రమాదం: నలుగురిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ స్టోర్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ స్టోర్ దుకాణంలో గురువారంనాడు అగ్ని ప్రమాదం జరిగింది.దీంతో భారీగా పొగ వ్యాపించింది. ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్థులో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ భవనంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయమై ఫైర్ ఫైటర్స్ ఆరా తీస్తున్నారు. ఈ భవనంలోని అన్ని అంతస్థులకు పొగ వ్యాపించింది. దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయక చర్యలు చేయడానికి ఫైర్ ఫైటర్లకు ఇబ్బందిగా మారింది. భారీ క్రేన్ల సహాయంతో ఈ భవనంలో చిక్కుకున్న వారెవరైనా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు గాను ఆరు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.
ఈ భవనంలోని నాలుగు,ఐదు అంతస్థుల్లో చిక్కుకున్న నలుగురిని రక్షించారు. మిగిలిన అంతస్థుల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయమై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ భవనం నుండి రక్షించిన నలుగురు మాత్రం భవనంలో ఎవరూ లేరని చెబుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అయినా కూడా ఈ భవనంలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయమై ఆరా తీస్తున్నారు.ఈ భవనం సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్ నుండి పొగలు వ్యాపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. పొగలు వెలువడుతున్న అంతస్థుల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భవనానికి ఉన్న కిటీకీల అద్దాలను కూడా ధ్వంసం చేశారు.
ఈ భవనం పక్కనే ప్రైవేట్ ఆసుపత్రి ఉంది. ఈ పొగ కారణంగా రోగులు ఇబ్బంది పడకుండా ఆసుపత్రి సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. మంటలు వ్యాపించిన భవనం చుట్టూపక్కల ఉన్న ఇళ్లలో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.