తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటన సంభవించింది. సచివాలయంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో గుమ్మటం మీద భారీగా పొగలు కమ్ముకున్నాయి. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. 11 యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. సచివాలయంలో వుడ్ వర్క్ జరుగుతోంది.
ఈ క్రమంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు నుంచి తెలుస్తున్న సమాచారం. ఈనెల 17న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సచివాలయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎలాంటి నష్టం జరగలేదు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.