బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన అతిరుద్ర మహాయాగంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
వికారాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సొంత నియోజకవర్గం తాండూరులో చేపట్టిన పూజల్లో అపశృతి చోటుచేసుకుంది. యాగం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడి టెంట్ కు అంటుకున్నాయి. ఇలా హోమగుండాల వద్ద ఏర్పాటుచేసిన టెంట్లు కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందినవెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేయడంలో ప్రమాదం తప్పింది.
గత మూడు రోజులుగా తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి సతీసమేతంగా అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తున్నారు. చివరిరోజయిన ఇవాళ పూర్ణాహుతి నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. టెంట్ కు మంటలు అంటుకోవడంతో యాగంలో పాల్గొన్నవారంతా భయాందోళనకు గురయి పరుగు తీసారు.ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు కుటుంబసభ్యులను కూడా భద్రతా సిబ్బంది అక్కడినుండి సురక్షితంగా తీసుకువెళ్లారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది యాగం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళారు. ఫైరింజన్ తో నీళ్లుచల్లి మంటలను అదుపుచేసారు. ఈ అగ్నిప్రమాందలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Video కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి
ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ... యాగం ముగిసేరోజు ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. తన కుటుంబసభ్యులతో పాటు యాగంలో పాల్గొన్న ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రోహిత్ రెడ్డి అన్నారు.
ఇదిలావుంటే రోహిత్ రెడ్డి చేపట్టిన ఈ యాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుటుంబంతో కలిసి మంత్రి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి అమ్మవారి చిత్రపటం బహూకరించి శాలువా, పూలమాలతో సత్కరించారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.
