న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాలకు రూ. 16,728 కోట్లు అదనంగా అప్పు తీసుకొనేందుకు కేంద్ర ఆర్ధికశాఖ అనుమతిని ఇచ్చింది.ఈజ్ ఆఫ్ డూయింగ్ లో  కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలను పూర్తి చేసినందున ఈ ఐదు రాష్ట్రాలకు అదనంగా ఈ అప్పు తీసుకొనే వెసులుబాటును కల్పించింది కేంద్రం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధికశాఖ అప్పు తీసుకొనే వెసులుబాటును కల్పిస్తున్నట్టుగా ఆదివారం నాడు ప్రకటించింది.

అదనంగా అప్పులు తీసుకోవడానికి  ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కేంద్ర ఆర్ధిక శాఖ సంస్కరణలను ప్రతిపాదించింది.  ఈ మేరకు ఈ ఏడాది మే మాసంలో ఈ సంస్కరణలను రాష్ట్రాల ముందుకు తీసుకొచ్చింది కేంద్రం.

కొన్ని సంస్కరణలపై కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కొన్ని రాష్ట్రాలు కొన్నింటిని అమలు చేస్తున్నాయి.  ఈజ్ ఆఫ్ డూయింగ్ లో జిల్లా స్థాయి సంస్కరణలను పూర్తి చేసినందుకు గాను అదనపు రుణం తీసుకొనేందుకు ఈ ఐదు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

ఐదు రాష్ట్రాలు ఇప్పటివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నిర్ధేశించిన సంస్కరణలను పూర్తి చేశాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలకు రూ. 16,728 కోట్లు సమీకరించేందుకు ఈ రాష్ట్రాలకు అనుమతి లభించిందని కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది.

రాష్ట్రాల అదనపు అవసరాలను తీర్చడానికి రాష్ట్రాల రుణ పరిమితిని స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 2 శాతం పెంచాలని కేంద్రం  ఈ ఏడాది మే మాసంలో నిర్ణయం తీసుకొంది.  

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు, వ్యాపార సంస్కరణలు చేయడం, పట్టణ స్థానిక సంస్థ, వినియోగ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కరణలు చేయడం వంటివి ప్రధానమైనవని కేంద్రం తెలిపింది.  ఈ సంస్కరణలను అమలు చేసినందుకు గాను ఏపీకి రూ. 2,425 కోట్లు, తెలంగాణకు రూ. 2,508 కోట్లు అదనపు రుణం తీసుకొనే వెసులుబాటు లభించింది.