Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు తీవ్ర అన్యాయం.. వేగంగా అభివృద్ది చెందుతుంటే అడ్డంకులు: కేంద్రంపై హరీష్ రావు ఫైర్

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Finance Minister Harish Rao slams central government in Budget 2023 speech
Author
First Published Feb 6, 2023, 1:57 PM IST

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రధాన రంగాలలో, ఉప రంగాల్లోనూ గణనీయమైన వృద్దిరేటు సాధిస్తుందని చెప్పారు. 2013-14‌లో రూ. 1,12,162‌గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2022-23‌లో రూ. 3,17,115 ఉండవచ్చని అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఇది జాతీయ సగటు అయిన రూ. 1,70,620 కంటే 86 శాతం ఎక్కువ అని అన్నారు. ఇది తెలంగాణ సాధించిన ప్రగతి అని చెప్పారు. 

అయితే రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు మీద అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణ పరిమితిని రూ. 53,970 కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచి, ఆమోదించుకుంటే.. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ. 15,033 కోత పెట్టిందని ఆవేదన వ్యక్తం  చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అసంబద్దమైనదని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. 

ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను యథాతథంగా అమలుపరిచే సంప్రదాయానికి ప్రస్తుత  కేంద్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని విమర్శించారు. తెలంగాణకు గ్రాంట్ల విషయంలో ఆర్థిక సిఫార్సులను పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖాతరు చేయలేదని అన్నారు.

 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94(1) సెక్షన్ ప్రకారం.. ఏపీ, తెలంగాణలో కేంద్ర పన్నుల్లో రాయితీలు ప్రకటించి తద్వారా ఆర్థిక, పారిశ్రామిక, అభిృద్ది కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కానీ కేంద్ర నామామాత్రపు రాయితీలతో రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసిందని విమర్శించారు. 94(2) సెక్షన్ ప్రకారం.. వెనకబడిన జిల్లా అభివృద్ది కోసం కేంద్రం నిధులు కేటాయించాల్సి ఉందని.. ఇందుకు సంబంధించి మూడేళ్లకు రూ. 1,350 కోట్లు ఇవ్వలేదని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధుల విషయంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసిన.. కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. 

విభజన చట్టంలోని చాలా అంశాలను కేంద్రం పరిష్కరించడం లేదని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీలను స్థాపించాలని ఉన్నప్పటికీ.. ఆ హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కృష్ణా జలాల వాటాను నిర్ణయించడంలో కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు.గతేడాది ఆగస్టులో కేంద్ర విద్యుత్ శాఖ బకాయిల చెల్లింపు పేరుతో ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణ పట్ల కేంద్ర ప్రదర్శిస్తున్న వివక్షకు మరో నిదర్శనమని చెప్పారు. విద్యుత్ సరఫరాకు సంబందించి మొత్తంగా రూ. 6,756.92 కోట్లను తెలంగాణ డిస్కంలు ఏపీ జెన్‌కో కు 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. 

విద్యుత్ వినియోగానికి సంబంధించి ఏపీ నుంచి రావాల్సిన రూ. 17,828 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పలుమార్లు కోరిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. చివరకు తెలంగాణకు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకపోయిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014-15లో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన రూ. 495 కోట్ల రూపాయలను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతా రహితంగా ఏపీకి బదిలీ చేశాయని.. ఈ అన్యాయాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా.. గత ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios