మహిళతో కలిసి ఫిల్మ్ ఎడిటర్ చీటింగ్.. అరెస్ట్

film editor navin reddy arrest
Highlights

సోషల్ మీడియా వేదికగా చీటింగ్..

చీటింగ్ కేసులో పోలీసులు ఫిల్మ్ ఎడిటర్  నవీన్ రెడ్డి ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళతో కలిసి ఇతరలను సోషల్ మీడియా వేదికగా మోసం చేస్తూ.. డబ్బు కాజేశారు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

రాచకొండ డీసీపీ(క్రైం) నాగరాజ్‌ కథనం ప్రకారం.. చింతల్‌కి చెందిన సలిమిడి నవీన్‌రెడ్డి శ్రేయాస్‌ మీడియా సంస్థలో ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. 2015లో ఇతడికి వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. అదే యేడాదినుంచి మరో మహిళ(వితంతువు)తో చింతల్‌ శ్రీనివాస్‌నగర్‌లో సహజీవనం చేస్తున్నాడు. 

నవీన్‌రెడ్డికి రెండు కుటుంబాలను పోషించడం భారంగా మారింది. సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో పడేసి డబ్బులు కాజేయాలని పథకం పన్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తి చాట్‌ రూం.ఆర్గ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టగా అతడితో చాటింగ్‌ చేయించాడు.

 ఆమె ఆ వ్యక్తి ఫోన్ నంబరు తీసుకుని వాట్సప్‌లో ఛాటింగ్‌ చేయడం ప్రారంభించింది.ప్రేమగా మాట్లాడుతూ బుట్టలో దించి అత్యవసరంగా తనకు రూ.20వేలు ఇవ్వాలని, రెండుమూడు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని కోరింది. దీంతో ఆయన పేటీఎం వ్యాలెట్‌లో డబ్బులు వేశాడు. 

తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేగా విజయవాడలో ఉన్న స్థలాన్ని విక్రయిస్తున్నానని, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన రూ.2లక్షలు ఇస్తే మళ్లీ మొత్తం డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన ఆయన రూ.1.80లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలో జమాచేశారు. 

తర్వాత నవీన్‌రెడ్డి తమ ఫోన్ లో నుంచి  సిమ్‌ కార్డును తొలగించి ఇద్దరూ అందుబాటులో లేకుండా పోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ సైదులు నిందితులను అరెస్టుచేసి కోర్టుకు హాజరు పరిచారు.
 

loader