Asianet News TeluguAsianet News Telugu

మీరు ఆ పనిచేస్తే వద్దన్నా ఓట్లన్నీ మీకే

  • ఉద్యోగులకు ఇంక్రిెమెంట్ ఇచ్చారు
  • మరి నిరుద్యోగులకు ఏమిచ్చారు?
fill all vacancies you will win hands down  professor nageswar advises KCR government

ఓట్ల కోసం నేడు రాజకీయ పార్టీలు బుర్ర బద్దలు కొట్టుకునే కాలం. నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే చంటి పిల్లల చెడ్డీలు కూడా ఉతికేందుకు వెనుకాడని రాజకీయ నేతలు ఉన్న రోజులువి. మరి ఓట్ల కోసం ఇంత డిమాండ్ ఉంటే.. చిన్న చిన్న పనులు చేస్తే వద్దన్నా ఓట్లు పడతాయని బ్రహ్మాండ్లమైన సలహా ఇచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ సలహా ఎవరికిచ్చారంటే తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి. మరి ఓట్ల వర్షం కురిపించే ఈ చిన్న సలహా ఏందబ్బా అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.

కొలువులకై కొట్లాట సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు. ఆయన మాటల్లోనే చదవండి. ఇది కొలువులకై కొట్లాట కాదు ప్రజలకై కొట్లాట. ఏ పోస్టు అయినా ఆ ఏడాదిలో ఖాళీ అయితే ఆ ఏడాదిలోనే నింపాలి. అలా నింపకుండా ఆపితే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం రావడం కాదు.. వారి సేవలు ప్రజానీకానికి అందకుండాపోయే ప్రమాదం ఉంది కదా?

ఒక ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే ఎన్నేళ్లయినా ఆగుతారా? ఇట్లనే మన ఉద్యోగాలను ఏండ్లకు ఏండ్లు ఆపినట్లు ఆపుతారా? ఆరు నెలల్లోనే నింపుతారు కదా? దానికొక ఎలక్షన్ కమిషన్ ఉంటది. ఎవరైనా ఎమ్మెల్యే  రాజీనామా చేస్తే వెంటనే నోటిఫికేషన్ ఇస్తారు. ఆ పోస్టు కోసం ఒక రాజకీయ నిరుద్యోగులు రెడీగా ఉంటారు. వాళ్లకు కొలువియ్యాలి గదా?

ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఉన్నట్లే యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎంప్లాయిమెంట్ కమిషన్ ఉండాలని అడుగుతున్నం. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఐదేల్లు పదేళ్లు ఎందుకు ఆగాలి. ఒక ఉద్యోగం ఖాళీ అయితే ఏడాదిలోగా ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా కమిషన్ ఏర్పాటు చేయాలి.

అందరికీ ఉద్యోగం ఇస్తరా? అంటున్నరు. అందరికీ ఉద్యోగం ఇయ్యలేకపోవచ్చు.. కానీ అందరికీ కోచింగ్ మాత్రం ఇయ్యొచ్చు. తెలంగాణ ప్రభుత్వం 50కోట్లు ఖర్చు పెడితే తెలంగాణలోని ప్రతి బిడ్డకు కోచింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను శాసనమండలిలో కొట్లాడిన. టివిల్లో చెప్పాను. ఈ వేదిక మీద కూడా చెబుతున్నాను. మీరు ఫ్రీ కోచింగ్ ఇవ్వండి. నిరుద్యోగులు వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ లకు పోవాల్సిన అవసరం లేకుండా చేయండి. పెద్ద మేలు జరుగుతంది.

తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కాని ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు మూడు లక్షల జీతాలు ఇచ్చారు. ఎందుకంటే వారంతా ఉద్యమంలో పాల్గొన్నారని చేశారు. మరి నిరుద్యోగులకు మీరు ఏమిస్తారు? అని అడుగుతున్నాను. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగుల కోసం, శ్రీకాంతచారి లాంటి వారి ఆత్మబలిదానాలకు గౌరవం దక్కాలంటే.. వన్ టైం రిక్రూట్ మెంట్ జరిపండి. ఉన్న ఖాళీ పోస్టులన్నీ మొత్తం ఖాళీ పోస్టులు భర్తీ చేయండి. తర్వాత ఏడాదికోసారి భర్తీ చేయండి. మీరు ఆ పని చేస్తే వద్దన్నా మీకే ఓట్లు పడతాయి. మాకు ఓట్లేమీ అవసరం లేదు. మేమేమీ పోటీ చేసేదిలేదు. ఓట్లు వేయించుకునేదిలేదు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒక విధానం ప్రకటించేదాకా విద్యార్థులు, నిరుద్యోగులు కొట్లాడాల్సిందే.. మనలాంటి వాళ్లందరూ భాగస్వామ్యంతో పనిచేయాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios