సెల్ ఫోన్ కోసం చెల్లితో గొడవ పడి.. ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ సంఘటన మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  మంచిర్యాల పట్టణానికి చెందిన కంభం దామోదర్ రెడ్డి.. ఓ ప్రైవేటు కళశాల ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె సుచిత డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది.

శనివారం రాత్రి సెల్ ఫోన్ విషయంలో చెల్లెలు హాసినితో సుచితకు వివాదం తలెత్తింది. గమనించిన తండ్రి దామోదర్ రెడ్డి.. పెద్ద కుమార్తెను మందలించాడు. పరీక్షలు దగ్గరపడుతున్నాయని.. చదువుకోవాలంటూ హితవు పలికాడు. కాగా.. తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన సుచిత రాత్రి పదిగంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. 

గమనించిన తల్లిదండ్రులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఆదివారం ఉదయం రైలు పట్టాలపై సుచిత శవమై కనిపించింది. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.