వైఎస్ విగ్రహానికి రంగు.. కాంగ్రెస్, వైసీపీల మధ్య ఘర్షణ

fight between congress and ysrcp over ys rajasekhar reddy statue
Highlights

కాంగ్రెస్‌ కార్యకర్తలు రంగు వేసే ప్రయత్నం చేయగా వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేశారు.
 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రంగు వేసే విషయంలో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి పక్కనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు రంగు వేసే ప్రయత్నం చేయగా వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేశారు. ఈసందర్భంగా ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వివాదం నెలకొని స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. 

ఈ విషయం తల్లాడ ఎస్‌ఐ ప్రసాద్‌ దృష్టికి వెళ్లటంతో ఆయన స్పందించి విగ్రహం వద్ద ఘర్షణ తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ విగ్రహానికి రంగు వేసే విషయంలో ఇరుపార్టీల మధ్య తలెత్తిన వివాదం గురించి పోలీసు ఉన్నతాధికారులకు ఎస్‌ఐ వివరించారు. దీంతో శుక్రవారం అన్నారుగూడెంలోని వైఎస్సార్‌ విగ్రహాన్ని వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్‌, సీఐ నాయుడు మల్లయ్యస్వామి, సందర్శించారు. 

అనంతరం తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సొసైటీ డైరెక్టర్‌ గోవిందు శ్రీనివాసరావు, వైసీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు సుధా నర్సింహారావులతో కూడిన ఇరుపార్టీల నాయకులతో చర్చలు జరిపి రాజీ కుదిర్చారు. వైఎస్సార్‌ విగ్రహం వద్ద యధాతథ స్థితిని కొనసాగించాలని, రంగు వేసే ప్రయత్నం చేయవద్దని ఇరువర్గాలకు పోలీసు అధికారులు హితవు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

loader