హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగైదు రోజులుగా ఈ సర్వే కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు  జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఇంటిని సర్వే చేయనున్నారు వైద్య సిబ్బంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు  ఎక్కువగా నమోదౌతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 

also read:తెలంగాణలో కరోనా జోరు: ఒక్క రోజులో 52 మంది మృతి

జీహెచ్ఎంసీ పరిధిలో 707 బృందాలు సర్వే చేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఎఎన్ఎం, ఆశావర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ ఉంటారు.  ఏదైనా ఇంట్లో ఫీవర్ తో ఎవరైనా ఉన్నారా అనే  అంశాన్ని పరిశీలించనున్నారు. జ్వరం, దగ్గు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్ ను అందించనుంది. ఇప్పటికే ఆరున్నరలక్షల కిట్స్ ను అధికారులు సిద్దం చేశారు.

కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే ఈ మందులు వాడడం ద్వారా వ్యాధిని అరికట్టే అవకాశం ఉందని వైద్యుుల చెబుతున్నారు. అంతేకాదు ఆసుపత్రులపై ఒత్తిడి పెంచకుండా తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి మెడికల్ కిట్స్  తో పాటు ప్రతి రోజూ వైద్యులు వారి ఆరోగ్య వివరాల గురించి ఆరా తీయనున్నారు. ఇంటి వద్దే రోగులకు చికిత్స అందించడం ద్వారా ఇతరులకు కూడ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉందని  అధికారులు చెబుతున్నారు.